కాంగ్రెస్ లో నాయకత్వంపై రచ్చ..!

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పులు అనివార్యమని, క్షత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం కావాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు ఇటీవల లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సోమవారం సీడబ్ల్యూసీ సమావేశంలో దూమారం రేగింది.  సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మకయ్యారని ఆరోపిస్తూ వారిపై రాహుల్ గాంధీ సమావేశంలో మండిపడ్డారు. సోనియా ఆరోగ్యం బాగాలేనప్పుడు సీనియర్లు లేఖ రాయడం సరికాదన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాం నబి ఆజాద్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరూ రాజీనామకు సిద్ధపడ్డారు. గత 30 ఏళ్లుగా ఏనాడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదని కపిల్ సిబల్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 

ఇక సమావేశంలో తన వ్యాఖ్యలపై నొచ్చుకున్న కపిల్ సిబల్ తో రాహుల్ వ్యక్తిగతంగా మాట్లాడారు. సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. దీంతో కపిల్ సిబల్ ట్విట్టర్ లో తన వ్యాఖ్యలను డిలీట్ చేశారు. 

అంతకుముందు పార్టీ అధ్యక్ష  బాధ్యతల నుంచి తాను వైదొలగుతున్నట్లు సోనియా గాంధీ వెల్లడించారు. తన స్థానంలో మరో నేతను ఎంపిక చేయాల్సిందిగా కోరారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఏకే ఆంటోని రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని కోరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ కూడా గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం సోనియా గాంధీ తన పదవీ కాలాన్ని పూర్తి చేయాలని కోరారు.

కాంగ్రెస్​ అధ్యక్షురాలిగా మరికొంతకాలం సోనియానే!

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరి కొంతకాలం కొనసాగనున్నారు. పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో నేతలు సుదీర్ఘ కాలం చర్చించారు. అయితే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు కొనసాగాలని సోనియాను సీనియర్లు కోరారు. 

Leave a Comment