పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పులివెందుల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పులివెందుల గురించి ప్రస్తావించారు.

‘రాష్ట్రంలో ఎక్కడ విన్నా పులివెందుల పంచాయతీ అంటున్నారు. పులివెందులలో సరస్వతి నిలయం అనే గ్రంథాలయం ఉండేది.. అలాంటి చదువుల సీమను ఫ్యాక్షనిజానికీ, గుండాయిజానికీ, రౌడీయిజానికి మారుపేరుగా మర్చేశారు’.. అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు కలిసి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గోపీనాథ్ కు ఫిర్యాదు చేశారు. 

 పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ పులివెందుల గడ్డ అంటేనే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు అన్నారు. మన రాష్ట్రానికి ఇద్దరు మంచి ముఖ్యమంత్రులను ఈ ప్రాంత ప్రజలు అందించారని తెలిపారు. టీడీపీ, బీజేపీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ పులివెందుల ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పవన్ కళ్యాణ్ పులివెందుల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.    

 

Leave a Comment