ఇక్కడ పరిస్థితి దారుణం: కౌషల్ భార్య నీలిమ.. తన ఆరోగ్యంపై క్లారిటీ..!

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌషల్ మండా అప్పట్లో ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కౌషల్ ఇటీవల తన భార్య నీలిమ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని నువ్వు నీ జీవితంతో పోరాడుతున్నావు.. నీకున్న ధైర్యంతో అది నువ్వు సాధిస్తావు అని నాకు తెలుసు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. నీ కలల కోసం పారాడిరా.. లవ్యూ.. మిస్ యూ’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అమెకు ఏదో అయిందని అంతా అనుకున్నారు. 

తాజాగా కౌషల్ భార్య నీలిమ తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. తాను యూకేలో ఉద్యోగం చేస్తున్నానని, అక్కడ పనిచేసే చోట ఏడు రోజుల క్రితం తనకు కరోనా సోకిందని తెలిపారు. 

అంతే కాదు ఈ వీడియోలో నీలిమ సంచలన విషయాలను వెల్లడించారు. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారని, కానీ ఇక్కడ ఘోరంగా ఉందని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ అని తేలాక శ్వాస సమస్యలు ఎదురయ్యాయని, ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చిందని తెలిపారు. 

తన పరిస్థితి బాగోలేదని, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెబితే వారు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. అక్కడ పెద్దగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి యూకేలో చికిత్స గొప్పగా ఉంటుందనుకున్నా అని, కానీ ఇది నిజంగా ఓ చేదు అనుభవమని పేర్కొన్నారు. 

ఈ విషయంలో తనకు భయమేసిందని నీలిమ చెప్పారు. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తారని, కాబట్టి మీరెవరూ భయపడొద్దని ధైర్యం ఇచ్చారు. మీ అందరి ప్రార్థన వల్ల ఇప్పుడు తాను బాగానే ఉన్నానని, ఆక్సిమీటర్ తో తన పల్స్ చెక్ చేసుకుంటున్నానని, త్వరలోనే భారత్ కు తిరిగి వస్తానని నీలిమ చెప్పుకొచ్చారు.  

Leave a Comment