ఫీజు కట్టాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి.. విద్యార్థిని ఆత్మహత్య..!

ఫీజు కట్టాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు ఒంగోలు, గొడుగుపాలెంకు చెందిన పాపిశెట్టి తేజస్విని(19) ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. 

తేజస్విని తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఫీజురీయంబర్స్ మెంట్ వస్తుందన్న ఆశతో తేజస్విని బీటెక్ లో చేరింది. కాని గత రెండేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల కాలేదు. దీంతో కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని తేజస్వినిపై ఒత్తిడి చేసింది. దీంతో మనస్తాపానికి గురైన తేజస్విని శుక్రవారం రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

మనసును కలిచివేసింది : చంద్రబాబు

 తేజస్వి ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఫీజు కట్టలేక తేజస్విని ఆత్మహత్య చేసుకున్నదన్న వార్త మనసును కలచివేసిందన్నారు. ఫీజు కట్టలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని, ఫీజు రీయంబర్స్ మెంట్ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం మాత్రం నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేసిందన్నారు.  

 

Leave a Comment