కోవిడ్ ఎప్పటికీ జీరో స్థాయికి చేరదు.. 20 తర్వాత కూడా కర్ఫ్యూ ఉంటుంది : సీఎం జగన్

కోవిడ్ ఎప్పటికీ జీరో స్థాయికి చేరుతుందని అనకోవద్దని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ ను ఎదుర్కోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు. బుధవారం స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలు మన జీవితంలో భాగం కావాలన్నారు..

కోవిడ్ నియంత్రణలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని సీఎం జగన్ కొనియాడారు. రాష్ట్రంలో కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కర్ఫ్యూ ఈనెల 20 వరకు కొనసాగుతుందని, 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని, గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని చెప్పారు. 

వారానికి ఒకసారి ఫీవర్ క్లినిక్స్ కూడా కచ్చితంగా నిర్వహించాలని సీఎం జగన్ తెలిపారు. థర్డ్ వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదని, మనం ప్రీపేర్ గా ఉండాలని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలన్నారు. థర్డ్ వేవ్ లో పిల్లలు ప్రభావం అవుతారని చెబుతున్నారని, పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. 

Leave a Comment