నాణ్యత తగ్గకూడదు : సీఎం జగన్‌

 తాడేపల్లి: నాడు-నేడు కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్టాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములవుతున్న తల్లిదండ్రుల పేర్లను స్కూళ్ల నోటీసు బోర్డులపై డిస్‌ప్లే చేయాలని అధికారులకు సూచించారు. దీని ద్వారా పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతుల కల్పన అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.

టెండర్లు ప్రారంభిస్తాం..

 రెండో విడత, మూడో విడత కింద చేపట్టాల్సిన పనులు, టెండర్ల ప్రక్రియపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ క్రమంలో మే మధ్యంతరంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని, టెండర్లు ఖరారు కాగానే పనులు మొదలుపెడతామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదే విధంగా పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల వలస..

మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పెట్టిన తర్వాత పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారని, ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల వలస ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు- నేడు కింద చేపట్టాల్సిన పనులపై సీఎం జగన్‌ అధికారులకు మరిన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీని దశలవారీగా అమలు చేయాలన్నారు.

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో పరిస్థితులపై చర్చ

ఇందులో భాగంగా  ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల పరిస్థితులపై కూడా సీఎం, అధికారులు చర్చించారు. చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించడంలేదని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో  నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అధిక ఫీజులపై కూడా దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. ఉన్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన విద్య అందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల, కాలేజీల రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్ల ఛైర్మన్లు జస్టిస్‌ కాంతారావు, జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment