వైఎస్సార్ రైతు భరోసా –పీఎం కిసాన్‌ పథకం ప్రారంభించిన సీఎం జగన్‌

లాక్‌డౌన్‌ సమయంలో రైతులను ఆదుకోవడం కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం సాగు పెట్టుబడి కోసం రైతులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి నేరుగా ఆర్థిక సహాయం చేసే ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఒకేసారి లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. 49,43,590 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి విషయంలో రైతులకు మంచి జరగాలని ప్రభుత్వం పరితపిస్తోందని అందుకే చెప్పిన దాని కంటే ముందే, ఇస్తానన్న దాని కన్నా ఎక్కువ సహాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతాయని తెలిపారు.

వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 ఆర్థిక సహాయం చేస్తున్నారు. గత నెలలో రూ.2 వేలు తీసుకోని వారికి ఆ మొత్తం కూడా కలిపి ఇప్పుడు ఒకేసారి రూ.7500  చొప్పున మొత్తం రూ.3675 కోట్ల ఇస్తున్నారు. తొలుత ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇవ్వాలని అనుకున్నా, ఆ తర్వాత ఆ అన్నీ పెంచి, 5 ఏళ్లు, ఏటా రూ.13,500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని, దీని వల్ల ప్రతి రైతు కుటుంబానికి 5 ఏళ్లలో రూ.67,500 ఆర్థిక సహాయం అందుతుందని సీఎం పేర్కొన్నారు.

మరో నెల రోజులు అవకాశం

గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిటింగ్‌ కోసం గత నెల 24 నుంచి రైతుల పేర్లు ప్రదర్శించామని, ఎవరైనా మిస్‌ అయితే దరఖాస్తు చేసుకోమని కోరామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మూడు వారాల్లో ఎవరైనా దరఖాస్తు చేయకపోతే, తమ పేర్లు నమోదు చేసుకోకపోతే, మరో నెల రోజుల సమయం ఇస్తున్నామని వెల్లడించారు. కాబట్టి అర్హులైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

30న రైతు భరోసా కేంద్రాలు

ప్రతి విషయంలో రైతుకు మంచి జరగాలని ఈ ప్రభుత్వం పరితపిస్తోందని, అందులో భాగంగా ఈనెల 30వ తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.  మొత్తం 11,600 గ్రామ సచివాలయాలు ఉంటే, 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. 

ఆర్‌బికేలలో రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, రసాయనాలు విక్రయిస్తారన్నారు. వాటి నాణ్యతలో ప్రభుత్వానిదే గ్యారంటీ అని, ఆ విధంగా నాణ్యతతో కూడిన విత్తనాలు, రసాయనాలు, పురుగు మందులు రైతులకు దొరుకుతాయని పేర్కొన్నారు. 

‘ఆ ఆర్‌బీకేలలో ఒక కియోస్క్‌ కూడా ఉంటుంది. అక్కడ ఉండే వ్యక్తి రైతులకు పూర్తిగా సలహాలు అందిస్తారు. ఏ పంట వేస్తే బాగుంటుంది, దేశంలో, రాష్ట్రంలో పరిస్థితి వంటివి వివరిస్తారు. అక్కడే ల్యాబ్‌ ఉంటుంది. భూసార నాణ్యతను పరీక్షిస్తారు. గ్రామ, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి’ అని సీఎం జగన్ వెల్లడించారు.

 

CLICK HERE :- https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase2Paymentstatus

Leave a Comment