కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి పి.హర్ దీప్ సింగ్ తో కలిసి ఎయిర్ పోర్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ  కర్నూలు జిల్లా నుంచి ఇప్పటి వరకు రోడ్డు లేదా రైలు మార్గమే అందుబాటులో ఉందని, ఇక నుంచి విమానయానం కూడా వచ్చిందని పేర్కొన్నారు. 

ఈ నెల 28 నుంచి ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయన్నారు. బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు సర్వీసులు నడుస్తాయని చెప్పారు. ఓర్వకల్లు విమానాశ్రయం రాష్ట్రంలో నిర్మించనున్న న్యాయ రాజధానిని, మిగితా రాష్ట్రాలతో సమానంగా, గర్వంగా నిలబడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రిబ్బన్ కటింగ్ తో హడావుడి చేసిందని, రూ.110 కోట్లు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని సీఎం జగన్ తెలిపారు.  

ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు:

1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్ర పోయిన ఒక మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడని, ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని సీఎం జగన్ తెలిపారు. ఈరోజు ఆయనకు నివాళిగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరు పెడుతున్నామని వెల్లడించారు. 

 

Leave a Comment