‘పీఎం కేర్ కు చైనా విరాళం’

చైనా సంస్థల నుంచి PM CARES ఫండ్స్ కు విరాళాలు అందాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి విరాళాలు అందాయని ఆదివారం బీజేపీ ఆరోపించగా, కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకు చైనాపై ‘సాఫ్ట్ స్పాట్’ ఉందని చెప్పింది. షియోమి, ఒప్పో మరియు హువావేలతో సహా ప్రసిద్ధ చైనా సంస్థలు వందల కోట్లు PM CARESకు విరాళాలు అందించాయని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. ఇది జాతీయ భద్రతకు ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. 

మే 20 నాటికి PM CARESకు రూ.9,678 కోట్లు వచ్చాయని నివేదికలు సూచిస్తున్నాయని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింగ్వి ఆరోపించారు. చైనా బలగాలు మన భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ చైనీస్ కంపెనీ నుంచి ప్రధాని మోడీ ఫండ్స్ అందుకున్నారన్నారు. ఇందులో భాగంగా సింగ్వి పీఎం మోడీకి కొన్ని ప్రశ్నలను వేశారు. 

  • హువావే సంస్థ నుంచి పీఎంకు రూ.7 కోట్లు రాలేదా?
  • హువావే సంస్థకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధం ఉన్న విషయం మీకు తెలియదా?
  • వివాదస్పద చైనా కంపెనీ టిక్ టాక్ నుంచి పీఎం కేర్స్ ఫండ్ కు రూ.30 కోట్లు విరాళంగా ఇవ్వలేదా?
  • పేటీఎం రూ.100 కోట్లను, షియోమీ రూ.15 కోట్లను, ఒప్పో కోటి రూపాయలను విరాళంగా ఇవ్వలేదా అని ప్రశ్నించారు. 

PM CARES ఫండ్ ప్రధాని మోడీ వ్యక్తిగత ఫండ్ లాగా ఉందని, ఇది ఏ అధికారి లేదా సమాచార హక్కు చట్టం ద్వారా కూడా ఆడిట్ చేయడానికి వీలులేకుండా ఉందని సింగ్వి ఆరోపించారు. ఈ ఫండ్ ను ప్రధాని రహస్యంగా నడుపుతున్నట్లు కనిపిస్తోందని తెలిపారు.  

 

Leave a Comment