పుట్టిన నెలల్లోనే చనిపోతున్న పిల్లలు.. విశాఖ ఏజెన్సీలో మిస్టరీ?

విశాఖ ఏజెన్సీలోని ఆ గ్రామంలో నివసించాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు అక్కడ ఉండేందుకు జంకుతున్నారు. ఎందుకంటే అక్కడ పుట్టిన రెండు నుంచి ఆరు నెలల్లోపు చిన్నారులు అంతుచిక్కని వ్యాధిలో చనిపోతున్నారు. గత రెండేళ్లలో 14 మంది చిన్నారులు మరణించారు. దీంతో ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తెలీక.. బిడ్డ కడుపున పడ్డాడని తెలియగానే ఆ కుటుంబ సభ్యులు గ్రామాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. 

అరకు లోయ నియోజకవర్గంలోని పెదబయలు మండలం మారుమూల రూఢకోట గ్రామంలో అంతు చిక్కని శిశుమరణాలు సంభవిస్తున్నాయి. ఈ గ్రామంలో సుమారు 1000 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామంలో రెండేళ్లలో 14 మంది చిన్నారులు ఆరోగ్యంగా పుట్టిన నెల నుంచి ఆరు నెలల వ్యవధిలో చనిపోయారు. వీరిలో గత ఆరు నెలల కాలంలో ఎనిమిది మంచి మరణించగా.. వారం వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. అలా గత రెండేళ్లలో 12 మంది చిన్నారులు మరణించారని అధికారులు చెబుతున్నారు. కానీ గ్రామస్థులు మాత్రం 14 మంది అంటున్నారు.. 

గ్రామంలో శిశు మరణాలు సంభవించడంతో గర్భవతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలన్నీ చేయిస్తున్నారు. అంతా బాగానే ఉంటుంది. అయినా పిల్లల మరణాలు మాత్రం ఆగడం లేదు. వాంతులు, పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చి పిల్లలు చనిపోతున్నారు. చనిపోయిన చిన్నారులంతా దాదాపు ఒకే విధంగా చనిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు. 

గ్రామంలో పుట్టిన పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆకస్మాత్తుగా పిల్లలు మరణిస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుందో అంతుపట్టడం లేదు. దీంతో గ్రామంలోని చాలా గడపలకు తాళాలు వేసి ఉంటాయి. ఉన్న 150 కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు వరుస శిశు మరణాలతో భయాందోళనకు గురై వేరే ఊర్లకు వెళ్లి పోతున్నారు. 

అయితే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి స్కానింగ్ చేయించుకోవడం లేదని వైద్యులు అంటున్నారు. స్కానింగ్ చేస్తే సమస్య ఏంటో తెలుస్తుందని చెబుతున్నారు. పిల్లలు మరణించిన వారిలో ఒక్కరు కూడా స్కానింగ్ చేయించుకోలేదని వైద్యులు అంటున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు చనిపోయిన వారిలో నాటు మందు వాడటం, పాలు సమయానికి ఇవ్వకపోవడం, మోతాదుకు మించి ఇవ్వడం, ఊపిరి సరిగా అందకపోవడం, డయేరియా వంటి కారణాలతో చనిపోయారని వైద్యులు చెబుతున్నారు.  అయితే రూఢకోటలో గత రెండేళ్లుగా శిశు మరణాలు సంభవిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

    

Leave a Comment