కేంద్రం ధోకా – పన్నుల వాటాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజం

 

 హైదరాబాద్‌ : తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వాపోయారు. కేంద్ర అసమర్థత వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఎలాంటి నిర్ణయాలనూ బడ్జెట్‌లో ప్రకటించలేదని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించలేదని, ముఖ్య రంగాలకు నిధులు తగ్గించడం వల్ల సామాజికాభివృద్ధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. 

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకూ నష్టం కలుగుతుందని, జీఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని విమర్శించారు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. ప్రతి సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారన్నారు. 2019-20 సంవత్సరంలో మాత్రం ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపానికి నిదర్శనమన్నారు. ఇది తెలంగాణపై ప్రభావాన్ని చూపిందని తెలిపారు. 

కేంద్ర బడ్జెట్‌(2020-21)లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు.  రాష్ట్ర వినతులు, అవసరాలను ఏ మాత్రం పరిగణనలోనికి తీసుకోలేదని, రావాల్సిన నిధుల్లో భారీ కోతలు విధించి వివక్ష చూపిందని మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని విమర్శించారు. కేంద్ర నిర్ణయాలు తెలంగాణ పురోగతికి శరాఘాతంగా మారనున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణకు సంబంధించిన, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ఆయన ప్రగతిభవన్‌లో నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్‌, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్‌పై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కని, దీనికింద తెలంగాణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారన్నారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గడంతో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తారుమారైందన్నారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థతే అని మండిపడ్డారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి.. రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉందన్నారు. 

మాటలకు చేతలకు పొంతన లేదు

2019-20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్రం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తోంది. ఈ సారి కూడా అంచనాలు సవరించే నాటికి చెప్పిన దాంట్లో ఎంత తగ్గిస్తారో తెలియదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా విషయంలో కేంద్రం చెప్పిన మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతోంది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలను చేపట్టిన తెలంగాణకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సులు చేసింది. వీటిని అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించాం. అయినా పట్టించుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు.

జీఎస్టీ విషయంలోనూ మోసం

జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తోంది. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా రూ.1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

పట్టణాలకూ తగ్గుదలే

కేంద్ర బడ్జెట్లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారు. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుంది. పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్‌లో గత ఏడాదికన్నా రూ.148 కోట్లు తగ్గించి, కేవలం రూ. 889 కోట్లు మాత్రమే కేటాయించారు. పట్టణాభివృద్దికి ఇచ్చే నిధుల్లో 14.3 శాతం కోత పెట్టారు.

ప్రాజెక్టులకు మొండిచేయి

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మించాం. వాటి నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చవుతుంది. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించాం. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు. రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు చేయలేదు.’

రెండు రకాలుగా నష్టం

2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కూడా తెలంగాణకు వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది.

– ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడం.

– రెండోది.. తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల రాష్ట్రానికి  రూ.2,381 కోట్లు తగ్గనున్నాయి.

కేంద్ర కేటాయింపుల్లో రంగాల వారీగా కోతలు

– వ్యవసాయరంగానికి 2019-20 బడ్జెట్‌లో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో అది 3.39శాతం మాత్రమే.

– వైద్య ఆరోగ్య రంగానికి గతేడాది 2.24 శాతం…ఈ ఏడాది ఇస్తామంటుంది 2.13 శాతమే.

– గ్రామీణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం.. ఈ ఏడాది 3.94 శాతం మాత్రమే.

– విద్యా రంగానికి గత ఏడాది 3.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.22 శాతం నిధులు మాత్రమే ఇస్తామంటున్నారు.

 

Leave a Comment