ఇక నుంచి మొబైల్ తో పాటు ఛార్జర్ కట్..!

మీరు కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే మీరు కొన్న కొత్త ఫోన్ తో ఛార్జర్ రాకపోవచ్చు. గతంలో మొబైల్ ఫోన్ తో పాటు ఇయర్ ఫోన్స్ ఇవ్వడాన్ని నిలిపివేయగా..ఇప్పుడు ఛార్జర్లను కట్ చేయాలని యాపిల్, శాంసంగ్ కంపెనీలు భావిస్తున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి ఫోన్లతో ఛార్జర్ లేకుండా ఇవ్వాలని శాంసంగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక యాపిల్ ఈ ఏడాది తెచ్చే కొత్తతరం మొబైల్స్ నుంచి ఛార్జర్లు లేకుండా హ్యాండ్ సెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. 

అయితే 20 వాట్ల సామర్థ్యంతో ఒక ఛార్జర్ ను మార్కెట్లోకి తీసుకురావాలని రెండు కంపెనీలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఛార్జర్లకు అయ్యే ఖర్చును ఫోన్లు కొనుగోలు చేసే వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఇక ఫోన్ తో పాటు ఛార్జర్ అదనంగా కొనాల్సి వస్తుంది.

అన్ని ఫోన్లకు ఒకే రకమైన ఛార్జర్ తీసుకురావాలని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఛార్జింగ్ మెకానిజమ్ ఒకే రకంగా ఉండే విధంగా యూఎస్బీ-సీ టైప్ ను యాపిల్, శాంసంగ్, గూగుల్, మోటరోలా, సోనీ కంపెనీలు మొదలుపెట్టాయి. 2021 నాటికి పూర్తి స్థాయిలో సీ టైప్ ఛార్జింగ్ కలిగిన ఫోన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. 

Leave a Comment