పోలీసు అధికారుల సంఘం స్పందించదా? : చంద్రబాబు

రాజమహేంద్రవరం : ఒంగోలులో ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తామని టీడీపీ  అధినేత చంద్రబాబు తెలిపారు. వైకాపా పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కుమారుడి వివాహానికి చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం అమరావతికి తిరుగు పయనమవుతూ రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ‘దిశ’ చట్టంలో లోపాలున్నాయన్నారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టం చేస్తున్నారని మండిపడ్డారు. 

200 మంది పోలీసు అధికారులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని.. సీనియర్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తే పోలీసు అధికారుల సంఘం స్పందించదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి కోర్టు ఆక్షేపణలు లేవన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైకాపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు పెడతారని ప్రజలు, వ్యాపారులు భయపడుతున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని  చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Comment