రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? : చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. బుధవారం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం హయాంలో మత సామరస్యాన్ని కాపాడామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో రధాని కి ఉండే మూడు వెండి సింహాలు మాయమైతే ఈఓ ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయలేదన్నారు. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతున్న తీరు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉందన్నారు. 

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయ భూములకు సంబంధించి 6 అక్రమాలు  జరిగాయన్నారు. దేవాలయ ఆస్తులు, ఆదాయాలకు సంబంధించి 9 అక్రమాలు  జరిగాయని, ఆలయాల కూల్చివేతలు 12 జరిగాయి. అన్యమత ప్రచారాలు 13 జరిగాయని తెలిపారు.  అర్చకులపై వేధింపులు 2 జరిగాయని, గోశాలలో గోవులు చనిపోయిన సంఘటనలు 3 జరిగాయని, ఇలాంటివి మొత్తం దాదాపు 80 సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన సంస్కృతి, బాధ్యత పాలకులకు ఉండాలన్నారు. అలా కాకుండా నా ఇష్టానుసారం పరిపాలన చేస్తానంటే ప్రజలు ఊరుకోరని, తిరగబడతారని స్పష్టం చేశారు.

హిందూ దేవాలయాలపై 80 దాడులు జరిగితే ఈ ముఖ్యమంత్రికి ఇంకా పరిపాలించే అర్హత ఉందా అని, ఏదేని మత విశ్వాసాలపై దాడులు జరిగితే కఠినంగా వ్యవహరించి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పై లేదా అంటూ ప్రశ్నించారు. ఈ రోజు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న వారు రేపు మసీదులపై, చర్చిలపై కూడా దాడులు చేస్తారన్నారు.

 

Leave a Comment