బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన

 

అమరావతి : బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ‌తో ఆయన మాట్లాడుతూ… ఏ రాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. అది వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని.. అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా’? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని చెప్పారు. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని వైసీపీ ఆరోపిస్తోందని, ఆ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారని మీడియా ప్రతినిధి అడగ్గా తాను రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తినేనని, అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తినని చంద్రబాబు గుర్తుచేశారు. రాయలసీమ గురించి మాట్లాడటానికి మీరెవరని… రాయలసీమకు మీరేం చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు ఎవరిచ్చారని నిలదీశారు. ఎన్టీఆర్ తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ఎన్టీఆర్ ప్రారంభిస్తే తాను పూర్తిచేశానని ఆయన చెప్పారు. అనంతపురానికి కియా మోటార్స్‌ను తాను తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు. శ్రీసిటీకి టీడీపీ హయాంలో పలు పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. వైఎస్ గానీ, జగన్ గానీ రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు.

Leave a Comment