కేంద్రం హెచ్చరికలు పాటించాలి : చంద్రబాబు

హైదరాబాద్‌: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత  పరిశుభ్రతను పాటించాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కరోనాను కట్టడి చేసేందుకు  ప్రతి ఒక్కరూ ఐదు దశలను పాటించి బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. కరోనా వైరస్‌ సోకినవారు బయట తిరిగితే ఇతరులకు వ్యాప్తిస్తుందని హెచ్చరించారు. ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే..  పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవారిని ముందే క్వారంటైన్‌ చేయాల్సిందని.. వారిని క్వారంటైన్‌ చేయడంలో ఆలస్యం జరిగిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పట్టణాలు, పురపాలికలు, గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇండియాలో కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగితే మన ఖ్యాతి పెరుగుతుందని అన్నారు.  

‘‘లాక్‌డౌన్‌ సమయంలో పని దొరకని కూలీలను ఆదుకోవాలి. గతంలో హుద్‌ హుద్‌ తుఫాను సమయంలో నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలను ఆదుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా పంపిణీ చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసింది. ఇది సరైన నిర్ణయం. ఇలాంటి తరుణంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం సమంజసం కాదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కేంద్రం చేసే హెచ్చరికలను అందరూ పాటించాలి. ప్రపంచ వ్యాప్తంగా 3.75లక్షల మందికి కరోనా సోకింది. దాదాపు 17వేల మంది చనిపోయారు. కరోనా వైరస్‌ వచ్చిన వారు బాధ్యతగా వ్యవహరించకపోతే .. మిగిలిన వారు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. రాజకీయాలకు ఇది సరైన సమయం కాదు. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముందుకుపోతోంది. కరోనా వైరస్‌తో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే .. ఈ సమయంలో రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరు’’ అని చంద్రబాబు అన్నారు.

 

Leave a Comment