కేసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు..

భూ అక్రమాలు ఎండగట్టేందుకు విశాఖ వెళ్తా

కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు 

కుప్పం: వాన్‌పిక్‌ కుంభకోణంలో రస్‌అల్‌ ఖైమా నుంచి రూ.కోట్లు దండుకున్న ఎవరూ ఆ కేసు నుంచి తప్పించుకోలేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ విదేశాల్లో ఇరుక్కున్నారని, ఆ నిధులను తమ సొంత పత్రికకు మళ్లించుకున్న వాళ్లూ ఈ కేసు నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. నియోజకవర్గంలోని పలు కూడళ్లలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ నేతల భూ అక్రమాలను ఎండగట్టేందుకు విశాఖ వెళ్తానని చెప్పారు. అర్థంలేని నిర్ణయాలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.

ఇంటిస్థలం ఇస్తామంటూ అసైన్డ్‌ భూములు లాక్కుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. భూసేకరణ చేసి పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. బోధనా ఫీజులు చెల్లించకుండా మోసం చేస్తూ వసతి దీవెన అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 9 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ప్రజలకు అప్పుడు ముద్దులు పెట్టారని, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో తనపై 26 కమిటీలు వేసినా ఏమీ తేల్చలేకపోయారన్నారు. విచారణల పేరుతో వేధిస్తే రాష్ట్రానికి పెట్టబడులు రావని చెప్పారు.

 

Leave a Comment