భావితరాలకు తీరని నష్టం చేస్తున్నారు.. : చంద్రబాబు

అమరావతి : టీడీపీతో పాటు తనపై వైసీపీ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో చెప్పడానికి కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌ మరో ఉదాహరణ అని మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. 9 నెలల్లో మూడు సిట్‌లు.. ఐదారు కమిటీలు వేసి టీడీపీనే కాదు,  ఏకంగా ఏపీనే టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. అడ్డగోలు చర్యలతో భావితరాలకు తీరని నష్టం చేస్తున్నారని ట్విటర్‌లో చంద్రబాబు దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి.. తవ్వండి అన్నారనీ.. తవ్వితే సన్మానాలు చేస్తాం.. అవార్డులు ఇస్తాం ప్లీజ్‌.. అంటూ అధికారులను బతిమిలాడుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎనిమిది నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేసి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు. కొత్తగా సిట్‌ ఏర్పాటుతో కక్ష సాధింపు తప్ప ప్రజలకు కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తనపై 26 విచారణలు, సీబీసీఐడీ విచారణ చేయించినా ఏమీ నిరూపించలేకపోయారన్నారు. ఇప్పుడూ అదే జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ వేధింపులకు 344 జీవోనే పరాకాష్ఠగా నిలుస్తోందన్నారు. తెదేపా నాయకులపై కక్షసాధించడమే వైకాపా అజెండాగా పెట్టుకుందన్నారు. తెదేపా నేతలు ఏనాడూ తప్పుచేయలేదనీ.. వైకాపా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

 

Leave a Comment