బంగారం దిగుమతిపై సుంకాన్ని పెంచిన కేంద్రం..!

బంగారం దిగుమతులకు కళ్లెం వేసేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళనల నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. జూన్ 30 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్త శాఖ నోటిఫికేషన్ లో తెలిపింది. 

బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరడంతో బంగారం డిమాండ్‌ను తగ్గించాలనే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకుంది. మే నెలలో మొత్తం 107 టన్నుల బంగారం దిగుమతి కాగా.. జూన్‌లో కూడా అదే స్థాయిలో బంగారం ఇండియాకు వచ్చింది. బంగారం దిగుమతులు పెరగడంతో కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెరిగింది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని పెంచినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

గతంలో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం ఉండగా, ఇప్పుడు 12.5 శాతానికి చేరనుంది. దీనికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి పన్నుతో కలిపి బంగారంపై బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి చేరింది. దీనికి  3 శాతం జీఎస్‌టీ  అదనపు భారం. తాజా నిర్ణయంతో ఎంసీఎక్స్‌ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

Leave a Comment