భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై రూ.25 నుంచి రూ.50 పెంపు..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల నుంచి ఇంధన ధరల వరకు భారీగా పెరిగాయి. తాజాగా సిమెంట్ ధరలు పెరగనున్నాయి. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బొగ్గు, పెట్ కోక్, ముడి చమురు ధరలు భారమవుతున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. దీంతో సిమెంట్ బస్తాపై రూ.25 నుంచి రూ.50 పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గత ఆరు నెలల్లో బొగ్గు, పెట్ కోక్ ధరలు 30 నుంచి 50 శాతం పెరగడమే ఇందుకు కారణమని వెల్లడించింది. 

ఆస్ట్రేలియాలోని కీలక మైనింగ్ ప్రాంతాల్లో వాతావరణం అనుకూలించకపోవడం, ఇండోనేషియాలో నిషేధం వల్ల బొగ్గు ఎగుమతులు తగ్గడం వల్ల బొగ్గు ధరలు పెరిగాయి. విద్యుత్, ఇంధన ధరల పెరుగుదల వల్ల సరుకు రవాణా ఖర్చు పెరిగింది. ఇది సిమెంట్ రవాణాలో 50 శాతం వాటాలను కలిగి ఉంది. బల్క్ డీజిల్ ధరలు లీటర్ కు రూ.25 పెరిగింది. రిటైల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఇవి సిమెంట్ ధరల పెంపునకు కారణమని క్రిసిల్ పేర్కొంది.  

పెట్ కోక్ ధరలు కూడా అంతర్జాతీయంగా మార్చిలో 43 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా పెట్ కోక్ ధర 96 శాతం పెరిగింది. దేశీయ పెట్ కోక్ ధరలు మార్చిలో 26 శాతం, ఏప్రిల్ లో 21 శాతం పెరిగాయి. సముద్ర రవాణా ఖర్చలు పెరగడం, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులతో పెట్ కోక్ దిగుమతి వ్యయం ఏడాది క్రితంతో పోలిస్తే ఒక్కో టన్నుపై 130 డాలర్ల మేర పెరిగింది. 

 

 

Leave a Comment