సమగ్ర భూ సర్వే వెంటనే చేపట్టండి : సీఎం జగన్‌ 

సమగ్ర భూ సర్వేను ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం సమగ్ర భూ సర్వేపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మూడు విడతల్లో సర్వే చేపట్టాలని, ఇది ముఖ్యమైన ప్రాజెక్టు అని సీఎం జగన్ వివరించారు. మండలాల వారీగా  బృందాలు ఏర్పాటు చేసుకుని సర్వే చేయాలన్నారు. సర్వే రాళ్ల ఖర్చుకూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. 

సమావేశంలో సమగ్ర భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామన్నారు. ఈ సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్‌ కోర్టులు నడుస్తాయని అధికారులు వివరించారు. 

దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని, సర్వే వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్‌ పద్ధతిలో భద్రపరుస్తామని అధికారులు తెలిపారు. ఈ డిజిటల్‌ సమాచారాన్ని పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ చేస్తామని వెల్లడించారు. ఈ డేటాను ఎవ్వరూ కూడా తారుమారుచేయలేని విధంగా ఒకే చోట కాకుండా మూడు నాలుగు చోట్ల భద్రపరుస్తామని అధికారులు తెలిపారు. 

అంతేకాకుండా భూ విక్రయాలు, బదలాయింపులు కూడా సులభంగా ఉంటాయని, రిజిస్ట్రేషన్ల ఆటో మ్యుటేషన్‌ జరుగుతుందని వెల్లడించారు. తద్వారా భూమిపై యాజమాన్యపు హక్కులు కూడా మారిపోతాయని, సమగ్ర భూ సర్వేకోసం వినియోగిస్తున్న కార్స్‌ నెట్‌వర్క్‌ ఏవిధంగా పనిచేస్తున్నదీ సీఎంకు అధికారులు అధికారులు వివరించారు. 

 

Leave a Comment