బీజేపీ పాలిత రాష్ట్రాల్లోె అమలు చేస్తున్న బుల్డోజర్ల సంస్కృతి తాజాగా ఏపీకి చేరింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి ప్రహరీని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అయ్యన్న పాత్రుడు రెండు సెంట్ల పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆదివారం జేసీబీలతో ఇంటి గోడను కూల్చివేశారు.
అయితే ఈనెల 2న అందజేసిన నోటీసుకు తాము సమాధానం ఇవ్వకుండానే గోడ తొలగించడం పట్ల అయ్యన్న పాత్రడి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము అన్ని అనుమతులు తీసుకున్నాకే గోడను నిర్మించామని, కానీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించి తమ ఇంటిని కూల్చివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఆయన ఇంటి వద్ద వంద మందికిపైగా పోలీసులు మోహరించారు. ఈ వ్యవహారంలో ఎవరినీ అరెస్ట్ చేయడం లేదని, ఆక్రమణల తొలగింపునకు అధికారులు ముందస్తుగా కోరిన మేరకు బందోబస్తు ఏర్పాటగు చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ విజయ్ భాస్కర్ తెలిపారు.