డ్యాన్స్ చేసిందుకు వధువు చెంప పగులకొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్ ను పెళ్లాడిన అమ్మాయి..!

పెళ్లిల్లో డ్యాన్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మండపంలో వధూవరులు డ్యాన్స్ చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది యువత కొత్తగా ప్రయత్నించాలని ఆరాటపడుతోంది. తాజాగా తమిళనాడులో పెళ్లి కుమార్తె డ్యాన్స్ చేస్తూ మండపానికి రావడంతో వరుడు ఆమెకు చెంప దెబ్బ కొట్టాడు. దీంతో ఆ వధువు పెళ్లి రద్దు చేసుకుంది. అంతేకాదు అదే ముహూర్తానికి తన బంధువును పెళ్లి చేసుకుంది. 

వివరాల మేరకు కడలూరులోని పన్రుతికి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురుకు, పెరియకట్టుపాళయానికి చెందిన యువకుడితో గతేడాది నబంబర్ లో నిశ్చితార్థమైంది. జనవరి 20న పెళ్లి తేదీని నిశ్చయించారు. అయితే పెళ్లి ముహూర్తానికి ముందు రోజు రిసెప్షన్ లో డీజే ఏర్పాటు చేశారు. ఈక్రమంలో వధువు తన బంధువులతో కలిసి స్టెప్పులు వేసింది. ఆసమయంలో వధువు కజిన్ కూడా స్టెప్పులు వేశాడు.. ఇద్దరు భుజాల మీద చేతులు వేసి డ్యాన్స్ చేశారు. 

వధువు అలా డ్యాన్స్ చేయడం వరుడికి నచ్చలేదు. కోపంతో వధువుకు చెంపదెబ్బ కొట్టాడు. ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా వరుడి చెంప వాయించింది. ఈ పెళ్లి తనకు వద్దని తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది వధువు. దీంతో అమ్మాయి తండ్రి వరుడు పనికిరాడని వివాహం రద్దు చేసుకున్నాడు. వధువు బంధువులలో తగిన వరుడిని చూసి అదే ముహూర్తానికి ఆమెక పెళ్లి చేశారు. ఈ వ్యవహారంపై వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి ఏర్పాట్ల కోసం తన కుటుంబం రూ.7 లక్షలు ఖర్చు చేసిందని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. 

Leave a Comment