బీజేపీకి వందల కోట్లలో విరాళాలు.. విరాళాల్లో కాంగ్రెస్ డీలా..!

దేశంలో అత్యధిక విరాళాలు పొందుతున్న పార్టీగా బీజేపి నిలిచింది. అయితే విరాళాల అంశంలో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ విరాళాల లెక్కలను సమర్పించాయి. ఈ లెక్కల ప్రకారం బీజేపీకి రూ.785.77 కోట్ల విరాళాలు అందినట్లు పేర్కొంది.

వివిధ కంపెనీలు, వ్యక్తుల నుంచి ఆ విరాళాలు వచ్చాయని తెలిపింది. బీజేపీకి అందిన విరాళాల్లో రూ.271 కోట్ల విరాళలు బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కు చెందిన జూపిటర్ క్యాపిటల్ తో పాటు ఐటీసీ గ్రూప్, భారతీ ఎయిర్ టెల్, జీఎమ్మార్ ఎయిర్ పోర్ట్ డెవలపర్స్ తదితర బడా కార్పొరేట్ సంస్థలతో కూడిన ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి అందాయి. జఏఎస్ డబ్ల్యూ గ్రూపు సంస్థలకు సంబంధించి జనకల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.45.95 కోట్లు, హిందల్కోకు చెందిన సమాజ్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.3.75 కోట్లు, ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.9 కోట్లు బీజేపీకి విరాళంగా అందించాయి. 

ఇక కాంగ్రెస్ పార్టీకి రూ.139 కోట్లు మాత్రమే విరాళంగా అందాయి. ఇందులో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ.58 కోట్లు వచ్చినట్లు ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాల్లో పేర్కొంది. అయితే ప్రాంతీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కాంగ్రెస్ పార్టీ స్థాయిలో విరాళాల్ని రాబట్టుకోగలిగింది. టీఆర్ఎస్ పార్టీకి రూ.130.46 కోట్లు విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రూ.92.7 కోట్లు వచ్చాయి. మహారాష్ట్రలో శివసేనకు రూ.111.4 కోట్లు, ఒడిశాలో బీజేడీకి రూ.90.35 కోట్లు, తమిళనాడులో ఏఐఏడీఎంకేకు రూ.89.6 కోట్లు, డీఎంకేకు రూ.64.90 కోట్లు విరాళాలు అందినట్లు ఆయా పార్టీలు పేర్కొన్నాయి. 

పార్టీలకు వచ్చిన విరాళాలు ఇలా ఉన్నాయి : 

బీజేపీ – రూ.785.77 కోట్లు

కాంగ్రెస్ పార్టీ – రూ.139.01 కోట్లు

టీఆర్ఎస్ – రూ.130.46 కోట్లు

శివసేన – రూ.111.4 కోట్లు

వైసీపీ – రూ.92.7 కోట్లు

ఏఐఏడీఎంకే – రూ.89.6 కోట్లు

డీఎంకే – రూ.64.90 కోట్లు

సీపీఐ(ఎం) – రూ.19.69 కోట్లు

సీపీఐ – రూ.1.29 కోట్లు

త్రుణముల్ కాంగ్రెస్ – రూ.8.08 కోట్లు

ఎన్సీపీ – రూ.59.94 కోట్లు

Leave a Comment