కేటీఆర్ ను ‘ఇడియట్’ అంటూ దూషించిన బీజేపీ నేత..!

తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ ‘ఇడియట్’ అని దూషించారు. టీకా విషయంలో కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ #LetsTalkVaccination అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ చాట్ ప్రారంభించారు. ఈ చాట్ కాస్త వివాదానికి దారితీసింది. 

ఈ చాట్ లో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత్ వ్యాక్సిన్ హబ్ గా ఉన్నప్పుడు ఇక్కడ డిమాండ్-సరఫరా మధ్య అంతరం ఎందుకు ఉందని ప్రశ్నించారు. దీనిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. మిగతా దేశాలు 2020 ప్రథమార్థంలోనే టీకాలకు ఆర్డర్లు ఇచ్చినప్పుడు, భారత ప్రభుత్వం ఎందుకు ఆలస్యంగా మేల్కొంది అని కేటీఆర్ ట్వాట్ చేశారు. 

కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై బీజేపీ నే ఖేమ్ చంద్ స్పందించారు. ‘యూ ఇడియట్.. ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తావా? సుమారు 17.5 కోట్ల మందికి వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చి ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాం. మొత్తంగా 22.37 కోట్ల మందికి టీకా ఇచ్చాం’ అని ఖేమ్ చంద్ బదులిచ్చారు. 

ఖేమ్ చంద్ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘సార్.. నేనూ మీలా మాట్లాడగలను. కానీ అది మా సంస్కృతిలో లేదు. ఇజ్రాయిల్ జనాభాలో 60 శాతం మందికి, అమెరికా 40 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చాయి. దీనిని బట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి ఇలాంటి విషయాలు కఠినంగానే ఉంటాయి’ అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ కోసం కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన రూ.35 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. భారత్ లో అందరికీ టీకా ఇవ్వాలంటే సుమారు 272 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 

Leave a Comment