రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్ల దాడి..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అయోధ్య రామాలయంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసిన అవసరం ఏముందని, రాముడి గుడికి విరాళాల సేకరణకు అకౌంట్ బులిటీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాముడి పవిత్రను బీజేపీ అపవిత్రం చేస్తోందన్నారు. 

రామ మందిరి నిర్మాణం కోసం బీజేపీ దొంగ పుస్తకాలు తయారు చేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు రామాలయం పేరుతో తెలంగాణలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. మరి 29 రాష్ట్రాల్లో 29 వేల కోట్ల రూపాయలు ఏం చేస్తారో చెప్పాలని ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. దేవుని పేరుతో అకౌంట్ బులిటీ లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ధర్మారెడ్డి వ్యాఖ్యలు స్థానికంగా కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.

 

Leave a Comment