పరీక్ష రాసేందుకు వెళ్లింది.. ప్రియుడితో పెళ్లాడి వచ్చింది..!

పదో తరగతి బోర్డు పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి తన ప్రియుడితో పెళ్లాడి తిరిగి వచ్చింది. ఈ ఘటన బీహార్ లోని కతిహార్ జిల్లాలో చోటుచేసుకుంది. మణిహరి ప్రాంతానికి చెందిన గౌరి శనివారం పరీక్ష రాసేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. 

అయితే ఆమె పరీక్ష హాలులోకి వెళ్లకుండా తన ప్రియుడి నితీశ్ తో కలిసి గుడికి వెళ్లింది. గుడిలో వీరిద్దరు పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి విషయాన్ని పోలీసులు ఇరు కుటుంబాలకు తెలిపారు. మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారని నచ్చజెప్పారు. దీంతో గౌరి తాను ప్రియుడిని తీసుకొని ఇంటికి వెళ్లింది.

వీరి ప్రేమ ఎలా మొదలైందంటే.. 2016లో గౌరి మొబైల్ కి మిస్ట్ కాల్ వచ్చింది. ఆమె తిరిగి కాల్ బ్యాక్ చేయగా నితీష్ అనే వ్యక్తి ఫోన్ మాట్లాడాడు. అలా నితీష్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. 

దీంతో వీరే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి పోలీసుల సహాయం కోరారు. ఇద్దరు మేజర్లు కావడంతో వీరి ప్రేమ వివాహానికి పోలీసులు సహకరించారు. అయితే పరీక్ష రాలేనందుకు తనకు ఏమాత్రం బాధలేదని, తాను ప్రేమలో పాస్ అయ్యానని గౌరి తెలిపింది. వచ్చే ఏడాది పరీక్షను రాస్తానని చెప్పింది.  

 

 

Leave a Comment