జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ..!

జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థపన చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి యాగశాలలోని కలశ జలాలను శంఖుస్థాపన ప్రాంతానికి తీసుకొచ్చి శిలలను అభిషేకించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీవారి ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.  

జమ్మూ జిల్లాలోని మజిన్ గ్రామం వద్ద 62 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆలయం కోసం ప్రభుత్వం 62 ఎకరాల భూమిని 40 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చింది. ఆలయాన్ని రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 

తొలి విడతలో 27.72 కోట్ల రూపాయలతో వాహన మండపం, అర్చకులు, ఇతర పాలనా సిబ్బందికి వసతి గృహాలు, తీర్థయాత్రికులకు వేచి ఉండే హాల్స్, ఇతర మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ పనులు, నీటి సరఫరా, విద్యుద్దీకరణ వంటి పనులను పూర్తి చేస్తారు. 

రెండో విడతలో మొత్తం రూ.5.50 కోట్లతో వేద పాఠశాల, కళ్యాణ మండపం నిర్మాణాలు పూర్తి చేస్తారు. శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మించాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు. కశ్మీర్ ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనకు వచ్చే యాత్రికులు శ్రీవారి ఆలయ దర్శనానికి వచ్చేలా సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు.  

 

Leave a Comment