రానున్న నాలుగు వారాలు జాగ్రత్త..

గత వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ అన్నారు. కొవిడ్‌ కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందని చెప్పారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌పై ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సహకరిస్తున్నారని.. వచ్చే మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు.

 వచ్చేది పెళ్లిళ్లు, పండగల సీజన్‌ కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లక్షణాలు ఉన్నవారికే కరోనా టెస్టులు చేస్తున్నట్లు డీహెచ్‌ తెలిపారు. విరేచనాలు, జ్వరం, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం లాంటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారే టెస్టుకు రావాలన్నారు. కొవిడ్‌ టెస్టింగ్ కేంద్రాల్లో గుంపులుగా ఉండటం సరికాదని.. సాధారణ లక్షణాలు రెండు మూడు రోజులకుగానీ తగ్గకపోతేనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొవిడ్‌ బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా పడకలు అందుబాటులో ఉన్నాయని.. బాధితుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పడకల సంఖ్యను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

 

Leave a Comment