మాస్క్ పెట్టుకోలేదని బ్యాంక్ కస్టమర్ ని కాల్చిన సెక్యూరిటీ గార్డు..!

మాస్క్ లేకుండా బ్యాంక్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ కస్టమర్ పై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటుచేసుకుంది. వివరాలు మేరకు ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన రాజేష్ అనే రైల్వే ఉద్యోగి, స్థానిక స్టేషన్ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో తన పాస్ బుక్ ఎంట్రీలు వేయించుకోవడానికి శుక్రవారం బ్యాంకుకు వచ్చాడు. 

కారులో వచ్చిన ఆయన కారు దిగి నేరుగా బ్యాంక్ కు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోయాడు. గేటు వద్ద సెక్యూరిటీ గార్డు కేశవ్ ప్రసాద్ మిశ్రా(45) మాస్క్ లేకుండా లోపలికి రానివ్వరని చెప్పాడు. దీంతో రాజేష్ వెనుదిరిగి కారు వద్దకు వెళ్లి మాస్క్ పెట్టుకుని మళ్లీ వచ్చాడు. 

అయితే ఈ సారి సెక్యూరిటీ గార్డు భోజనాల సమయం అయిందని, తర్వాత రావాలని రాజేష్ ను ఆపేశాడు. ఈక్రమంలో సెక్యూరిటీ గార్డు, రాజేష్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సెక్యూరిటీ గార్డు కోపంతో రాజేష్ కాలుపై కాల్పులు జరిపాడు. దీంతో రాజేష్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.

రక్తపు మడుగులో ఉన్న రాజేష్ ను రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాజేష్ తన భార్య ప్రియాంకకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె రాజేష్ సహ ఉద్యోగులకు సమాచారం ఇచ్చి పరుగున బ్యాంక్ వద్దకు చేరుకుంది. వారందరూ కలిసి రాజేష్ ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న కొట్వాలి పోలీసులు సెక్యూరిటీ గార్డు కేశవ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment