ఐదు రోజులు మూతపడనున్న బ్యాంకులు

న్యూఢిల్లీ : గత నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో వరుసగా రెండు రోజులు మూత పడిన బ్యాంకులు వచ్చే నెలలో మూడు రోజులు మూతపడనున్నాయి. వేతన పెంపు, వారానికి ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌తో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో  మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్త సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చాయి. మార్చి 14 రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం సెలవు దినం కావడంతో బ్యాంకులు వరుసగా ఐదు రోజులు మూతపడనున్నాయి. అయితే, ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకుల కార్యకలాపాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. 

ఏప్రిల్ నుంచి నిరవధిక సమ్మె..

 తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని యూనియన్లు ప్రకటించాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి తమ వేతనాలను సవరించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారి 2012లో ఉద్యోగుల వేతనాలు సవరించారు. ఆ తర్వాత 2017లో సవరించాల్సి ఉండగా ఇప్పటి వరకు అది అమలు కాలేదు. వేతనాల సవరణ కోసం యూనియన్లు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి. పే స్లిప్‌పై 20 శాతం పెంపు కావాలని యూనియన్లు పట్టుబడుతున్నాయి.అయితే, ఐబీయే మాత్రం 19 శాతం ఇస్తామని చెబుతోంది. అలాగే వారానికి ఐదు రోజుల పని దినాలు కావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో పబ్లిక్ హాలీడేలు గణనీయంగా ఉండడంతో అది సాధ్యం కాదని ఐబీయే తేల్చి చెప్పింది. ప్రతీ శని, ఆదివారాలు బ్యాంకులు మూతపడితే ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని చెబుతూ వారి డిమాండ్‌ను నిరాకరిస్తోంది.

You might also like
Leave A Reply

Your email address will not be published.