15, 16 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవులు..!

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై పునరాలోచనకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో మార్చి 15, 16 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని బ్యాంక్ యూనియన్లు నిర్ణయించాయి. దాదాపు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రకటించింది. 

ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సానుకూల ఫలితాలు రాకపోవడం సమ్మెకు దిగాలని నిర్ణయించామని ఏఐబీఈఏ వెల్లడించింది. ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ కొన్ని బ్యాంకులను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నామనన్నారు. 

ఎగవేతదారులు, మొండి బకాయిల రికవరీ కోసం చర్యలు తీసుకోవడానికి బదులు ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరించాలని చూస్తోందన్నారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్మను పెద్ద కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టాలని చేస్తోందని ఆయన విమర్శించారు. కాగా మార్చి 4,9,10 తేదీల్లో బ్యాంకు యూనియన్లు, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రైవేటీకరణపై చర్చలు జరిగాయి. బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బ్యాంక్ యూనియన్లు కోరాయి. 

వరుసగా 4 రోజులు సెలవులు..

ఇక సమ్మె మరియు బ్యాంక్ సెలవుల కారణంగా వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. మార్చి 13న రెండో శనివారం, 14న ఆదివారం, 15, 16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలపునివ్వడంతో వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 

 

Leave a Comment