ఇండస్ట్రీలో పవన్ ను ఒంటరి చేశారా?.. ఫైర్ అయిన బండ్ల గణేష్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ అందుకుంది. మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ సూపర్ హిట్ టాక్ తో అదరగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు పవన్ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత పెద్ద హిట్ టాక్ తెచ్చుకున్న వకీల్ సాబ్ ఏపీలో మాత్రం వివాదాస్పదం అవుతోంది.

వకీల్ సాబ్ సినిమా బెన్ ఫిట్ షో వేయకూడదని, టికెట్స్ రేట్స్ పెంచకూడదని ఏపీ సర్కార్ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ప్రభుత్వ తీరును సవాల్ చేస్తూ సినిమా డిస్టిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ టికెట్ ధరలను కేవలం శనివారం వరకే అమలు చేయాలని తీర్పునిచ్చింది. ఆదివారం నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధరలు ఉంటాయని డివిజన్ బెంచ్ చెప్పింది. ఆన్ లైన్ లో బుక్ అయిన టికెట్ల విసయంలో ఆదివారం షోల వరకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. 

ఒంటరి చేశారా?

ఇదిలా ఉంటే.. ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమాపై జరుగుతున్న రచ్చ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం విశేషం.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు కూడా ఎక్కడా కనిపించలేదు. టాలీవుడ్ పెద్దగా చలామణి అవుతున్న చిరంజీవి సైతం నోరు మెదపలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మాకెందుకే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇండస్ట్రీ మొత్తం ఒక అడుగు ముందుకేసీ స్పందించాల్సిన సమయంలో కూడా మౌనం వహించి పవన్ ని ఒంటరి వాడిని చేశారు.

టాలీవుడ్ పెద్దలు ఎక్కడ? : బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ మాత్రం ఈ విషయంపై స్పందించారు. వకీల్ సాబ్ సినిమా విషయంలో ఇంత జరుగుతున్నా సినీ పెద్దలు ఎవ్వరికీ పట్టదా అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఏపీ ప్రభుత్వంపై కూడా బండ్ల గణేష్ మండిపడ్డాడు. వకీల్ సాబ్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని కామెంట్ చేశారు. కేవలం ఈ సినిమాకేనా లేక భవిష్యత్తులోనూ ఇలానే చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.   

  

Leave a Comment