తెలంగాణలో మరో ఆనందయ్య.. కరోనాకు భీమయ్య మందు..రిస్క్ వద్దంటున్న పోలీసులు..!

కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే మందుపై ఎంత చర్చ జరుగుతుందో తెలిసిందే.. ఇప్పటికే ఆనందయ్య మందుపై శాస్తీయత కోసం అధ్యయనం జరుగుతోంది. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మందు పంపిణీకి అనుమతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

తాజాగా తెలంగాణలోనూ ఓ నాటు వైద్యుడు కరోనాకు మందు ఇవ్వడం మొదలుపెట్టాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన బచ్చలి భీమయ్య అనే వ్యక్తి కరోనాకు నాటుమందు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 300 మంది కరోనా రోగులను తన మందుతో నయం చేశానని భీమయ్య తెలిపారు. 

ప్రభుత్వం అనుమతిస్తే మందును పెద్ద మొత్తంలో తయారు చేస్తానని చెప్పారు. కేవలం రెండు గంటల్లోనే కరోనాను నయం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వనమూలికలతో మందు తయారు చేసే జ్ఞానం తనకు వంశపారంపర్యంగా వచ్చిందని భీమయ్య తెలిపారు. 

తన తాత దగ్గర నుంచి తాను వైద్యం గురించి తెలుసుకున్నానని, 13 వనమూలికలతో తయారు చేసిన మందు కరోనా వ్యాధిగ్రస్తులకు బాగా పనిచేస్తుందని భీమయ్య తెలిపారు. ఆనందయ్య లాగే భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ విషయం పోలీసులకు తెలియడంతో మందుపై ఎలాంటి శాస్త్రీయత లేదని, ఆ మందును వాడి ప్రజలు రిస్క్ తీసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు..

 

 

Leave a Comment