ఒక్క ఫొటో ఓ ఎస్సైని వీఆర్ కు పంపింది..!

ఒక్క ఫొటో కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎస్సైని వీఆర్ కు పంపించేలా చేసింది.. విధి నిర్వహణలో సమర్థుడిగా ఆయనకు పేరు ఉంది. ఫ్రంట్ వారియర్ గా కరోనా కట్టడి తన వంతు ప్రయత్నాలు కూడా చేపట్టారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అందరినీ అప్రమత్తం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఒక్క ఫొటో ఆయన డ్యూటీనే మార్చివేసింది. ఎస్సైని వీఆర్ లోకి పంపించేసింది..

కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం నిబంధనలను పర్యవేక్షిస్తున్న ఆత్మకూరు ఎస్సై నాగేంద్రప్రసాద్ కేజీరోడ్ పై ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఒక దుకాణం వద్ద ఆగారు. అందులో ఉన్న చెర్నాకోల్(కొరడా) చేత్తో పట్టుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్త జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. 

దీంతో ఎస్సై నాగేంద్రప్రసాద్ ను ఆదివారం కర్నూలులోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలా చెర్నాకోల్ ఫొటో ఎఫెక్ట్ తో ఎస్సై నాగేంద్రప్రసాద్ పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో శ్రీశైలం వన్ టౌన్ ఎస్సై హరిప్రసాద్ ను ఆత్మకూరు పట్టణానికి ట్రాన్స్ ఫర్ చేశారు..

Leave a Comment