చదువుకు వయసు అడ్డు కాదు.. అన్న మాటలను నిజం చేసి చూపించారు ఈ పెద్దాయన.. ఆయన పట్టుదల ముందు వయసే చిన్నబోయింది. రిటైర్డ్ అయ్యాక మళ్లీ చదవాలని ఎవరికీ ఉంటుంది చెప్పండి.. వచ్చే పింఛన్ డబ్బులతో జీవితం హ్యాపీగా గడపాలని ఉంటుంది.. కానీ ఈ పెద్దాయన మాత్రం 64 ఏళ్ల వయసులో గేట్ పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 140వ ర్యాంక్ సాధించారు..
అనంతపురానికి చెందిన సత్యనారాయణ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖలో 39 ఏళ్లు ఇంజనీర్ గా పనిచేశారు. 2018లో డీఈఈగా ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్డ్ అయ్యాక కూడా ఆయన చదవాలనుకున్నారు. అందుకే 2019లో జేఎన్టీయూలో సివిల్ డిపార్ట్ మెంట్ లో ఎంటెక్ లో చేరి 2022లో పూర్తి చేశారు.
అనంతరం గేట్ ఎగ్జామ్ రాసి జియోమోటిక్స్ ఇంజనీరింగ్ పేపర్ లో 140వ ర్యాంక్ సాధించారు. ఆయన జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిమోట్ సెన్సింగ్ కోర్సుల్లో చేరేందుకు రెడీ అయ్యారు. కుటుంబ సభ్యులతో చర్చించి బాంబే లేదా రౌర్కెలాలోని ఐఐటీలో చేరాలని భావిస్తున్నట్లు సత్యరానారాయణ రెడ్డి వివరించారు. ఆయన వయసు ప్రస్తుతం 64 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.