ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.  అమరావతిలో భూఅక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్‌కు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.

కేబినెట్ నిర్ణయాలు..

– ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ

– 26,976 ఎకరాలు ప్రభుత్వ భూమి..16,164 ఎకరాలు ప్రైవేట్ భూమి కొనుగోలు

– పేదలకు ఇచ్చే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం

– ఇళ్ల స్థలాలకు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది. 

– దీని కోసం తహసీల్దార్లను జాయింట్ రిజిస్ట్రార్లుగా ప్రభుత్వం గుర్తింపు

– బ్యాంకుల్లో ఇళ్ల పట్టాలు తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు

– ఎన్‌పీఆర్‌లో మార్పులు కోరుతూ కేబినెట్ తీర్మానం

– 2010లో ఉన్న ప్రశ్నలకు పరిమితం అవుతూ మార్పులు చేసేవరకూ..రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ ప్రక్రియ నిలిపివేయాలని కేబినెట్ తీర్మానం

– భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో జీఎమ్మార్‌కు ఇచ్చిన 2700 ఎకరాలు 2200కు కుదింపు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్ని నాని వెల్లడించారు. ఎన్నికల కోసం అసెంబ్లీ కూడా వాయిదా వేసుకున్నామన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే రిజర్వేషన్లు కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ బీసీ పార్టీ అని చెప్తుందని.. చంద్రబాబు బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లపాలనలో మైనార్టీ, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబుకు అధికారంలో ఉండగా ఏమీ గుర్తుకురావని మంత్రి పేర్ని నాని అన్నారు.

 

Leave a Comment