ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రొరోగ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ప్రొరోగ్‌ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉభయసభలను ప్రోరోగ్‌ చేసిన నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో ప్రభుత్వం  ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలిలో ఆమోదం పొందలేదు. దీంతో ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసింది. ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీకి పేర్లు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి చైర్మన్ ఆదేశించారు. కానీ కార్యదర్శి మాత్రం ఆ ఫైల్‌ను వెనక్కి పంపించారు. దీనిపై మండలి ఛైర్మన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 48 గంటల్లో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని మరోసారి మండలి చైర్మన్  ఆదేశించారు. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ఉభయసభలను ప్రోరోగ్ చేయడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు పరిగణనలోకి వచ్చినట్లేనని సర్కార్ ఆలోచిస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా ఈ రెండు బిల్లులు ఆమోదిస్తే కార్యాలయాలు తరలించాలని భావిస్తోంది. మరోవైపు ఈ బిల్లులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈనెల 25న ఈ బిల్లులపై హైకోర్టు విచారించనుంది. నిన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖ నుంచే పాలన కొనసాగుతోందని చెప్పారు. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment