29న మరో అల్పపీడనం.. దూసుకొస్తున్న ‘బురేవి’ తుఫాన్..

ఇప్పటికే నివర్ తుఫాన్ ధాటికి ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నివర్ నుంచి కోలుకోముందే.. బంగాళఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళఖాతంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. 

దీని ప్రభావం కారణంగా డిసెంబర్ నెలలో మరో రెండు తూపాన్లు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్ 2న ‘బురేవి తుఫాన్’ తీవ్ర ప్రభావం చూపనుందని వెల్లడించింది. దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అంతేకాదు, డిసెంబర్ 5న మధ్య బంగాళఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ‘టకేటి తుఫాన్’ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై చూపనుందని పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కాగా గడిచిన 24 గంటల్లో నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రమంతా భారీ వర్షాలతో పాటు మోస్తరు వానలు కురిశాయి. 

Leave a Comment