ప్రాణం తీసిన సెల్ ఫోన్.. పగిలిపోవడంతో భయపడి..!

 సెల్ ఫోన్ ఓ అమ్మాయి ప్రాణాలు తీసింది. ఫోన్ తీసుకొని ఆడుకుంటుండగా పొరపాటు జారి పడి పగిలిపోయింది. దీంతో ఎక్కడ తండ్రి తిడతాడో అన్న భయంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమ్మాయి చనిపోయింది. ఈ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని చిన జగ్గంపేటలో మంగళవారం జరిగింది.   

గ్రామానికి చెందిన సారిపల్లి నాగన్నకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురుకు పెళ్లయింది. రెండో కూతురు సత్యవేణి(16) ఆరో తరగతి వరకు చదవి మానేసింది. ఆమె ఫ్రెండ్స్ అందరూ సెల్ ఫోన్ వాడుతుండటంతో తనకు కూడా కొనిపెట్టమని తండ్రిని అడిగేది. నిరుపేద కుటుంబం కావడంతో తనకు అంత స్థోమత లేదని తండ్రి నచ్చజెప్పేవాడు. 

కూతురు తరచూ అడుగుతుండటంతో అప్పు చేసి ఈనెల 11న కొత్త సెల్ ఫోన్ కొనిచ్చాడు. సెల్ ఫోన్ కొన్న రోజే తన చెల్లెలితో కలిసి సత్యవేణి ఆడుకుంటుండగా.. అది పొరపాటున కింద పడింది. దీంతో ఆ సెల్ ఫోన్ పగిలిపోయింది. ఈ విషయం తండ్రికి తెలిస్తే తిడతాడని భయపడి.. ఎవరికీ తెలియకుండా గడ్డి మందు తాగింది.

కొంతసేపటికి వాంతులు కావడంతో ఏమైందని అడగ్గా గడ్డి మందు తాగినట్టు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. 

Leave a Comment