కాళ్లూచేతులు లేకున్నా.. వాహనం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ఉద్యోగం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా..!

కాళ్లు లేవు.. చేతులు లేవు.. కానీ ఆత్మవిశ్వాసం ఫుల్ గా ఉంది.. అందుకే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆ దివ్యాంగుడి పట్టుదలకు ముగ్ధుడయ్యారు. తన సంస్థలో అతడికి ఉద్యోగం ఆఫర్ చేశారు. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అతడి ఆత్మవిశ్వాసానికి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి రెండు చేతులు, కాళ్లు లేవు. అయినప్పటికీ తన కోసం స్పెషల్ గా ట్రాలీ లాంటి వాహనాన్ని డిజైన్ చేయించుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ముసలి తండ్రి ఉన్నారు. వారిని పోషించాల్సిన బాధ్యత అతనిదే.. అందుకే ప్రత్యేకంగా తయారు చేయించిన వాహనంలో సరుకుల లోడ్ వేసుకెళ్తూ.. డబ్బులు సంపాదిస్తున్నట్లు ఆ వ్యక్తి వీడియోలో చెప్పుకొచ్చాడు.  

ఈ వీడియో కాస్త ఆనంద్ మహీంద్ర కంట పడింది. దీంతో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ వీడియో తన టైమ్ లైన్ లో కనిపించిందని, ఇది ఎంత పాతదో, ఎక్కడ చిత్రీకరించారో తెలియదని పేర్కొన్నారు. ఆ వ్యక్తికి మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థలో ఎలక్ట్రిక్ లాస్ట్ మైల్ డెలివరీ సర్వీస్ కోసం బిజినెస్ అసోసియేట్ గా ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో విశేష స్పందన వస్తోంది..  

Leave a Comment