ఆలయాల్లో వృథాగా పోయే పాలను సేకరించి పేద పిల్లలకు పంచుతున్న వృద్ధుడు.. ఎక్కడో తెలుసా?

శ్రావణ మాసంలో శివుడికి భక్తులు వేల లీటర్ల పాలను సమర్పిస్తారు. అయితే ఈ పాలు చాలా వరకు వృథా పోతూ కాల్వల్లో కలుస్తుంటాయి. ఇలా వృథా కాకుండా పాలను ఆలయాల నుంచి సేకరిస్తున్నాడు ఓ 70 ఏళ్ల వృద్ధుడు. ఆ పాలను మరగబెట్టి పంచదార కలిపి కనీసం మంచి నీరు కూడా అందని పేద ప్రజలకు పంచుతున్నాడు. 

గుజరాత్ లోని జూనాగఢ్ కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడిని అందరు మిల్క్ మ్యాన్ అని పిలుస్తుంటారు. ఆయన దగ్గరలోని ఆలయాల నుంచి పాలను సేకరించి పేద పిల్లలకు, పెద్దలకు పంచుతున్నారు. అయితే ఇంత వరకు ఆయన ఎవరీకి తన పేరు చెప్పలేదు. ఎవరైనా అడిగితే కేవలం ‘ఇండియన్’ అని చెబుతారు. జూనాగఢ్ లో ఆయనను ఈ పేరుతోనే పిలుస్తారు. ఈ దేశ పౌరులు కులం, మతం పేరుతో విడిపోకూడదని ఆయన అంటున్నారు. అంతేకాదు ‘ఓన్లీ ఇండియన్’ అనే పేరుతో ఈయన స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. భారత్ లో ఏకైక వ్యక్తితో నడుస్తున్న సంస్థ బహుష ఇదొక్కటే అయి ఉండొచ్చు. 

పాలు అలా వృథా కాకూడదు : వృద్ధుడు

‘‘2012 జనవరి 26 నుంచి ఈ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాను. శ్రావణ మాసంలో భక్తులు శివుడికి వేల లీటర్ల పాలు సమర్పిస్తారు. దేవుడికి పాలను సమర్పించడాన్ని నేను వ్యతిరేకించను. ఎందుకంటే దేవుడిపై అది వారి నమ్మకం. కాని పాలు అలా వృథా కాకూడదు. ఆ పాలను ఎలా అరికట్టాలని ఆలోచించాను. అప్పుడు ఈ పాలను పేదలకు పంచాలని ఆలోచన వచ్చింది. ఆలయాల నుంచి పాలను సేకరించేందుకు ఇండియన్ మిల్క్ బ్యాంక్ ని స్థాపించాను. జూనాగఢ్ లోని చాలా దేవాలయాల్లో పాలు సేకరించేందుకు పాల క్యాన్లు ఏర్పాటు చేశాను. 9 ఏళ్లుగా ఈ పాలను సేకరించి పంచుతున్నాను. సాధారణ సోమవారాల్లో ఒక దేవాలయంలో 5-7 లీటర్ల పాలను సేకరిస్తాను. మొత్తంగా 35-40 లీటర్ల పాలు అవుతాయి. ప్రజలు తాము తెచ్చే పాల ప్యాకెట్లలో కొంత భాగం దేవుడికి సమర్పించి మిగితావి పక్కనే ఉన్న పాల క్యాన్లలో పోస్తారు. రోజు ఉదయం 11 గంటలకు ఈ పాలను సేకరిస్తాను. వీటిని మరగబెట్టి అంతా బాగుందని నిర్ధారించుకున్నాక పంపిణీ చేస్తాను. ముఖ్యంగా 11 ఏళ్ల లోపు పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు ఈ పాలు అందిస్తాను’’ అంటూ ఆ వృద్ధుడు చెప్పుకొచ్చారు.  

దేవుడికి సమర్పించే పాలలో కొంత సేకరించి పేదలకు పంచడం ఇదే ఆయన నినాదం. రోజూ పాలను సేకరించేందుకు, పంచేందుకు జూనాగఢ్ లోని పలు ప్రాంతాలకు ఆయన వెళ్తుంటారు. ఎండ, వాన, చలి అన్న తేడా లేదు. ఎప్పుడైనా సైకిల్ పైనే వెళ్తుంటారు. ప్రకృతిని పరిరక్షించడం అందరి బాద్యత అని ఆయన అంటారు. పేదలందరికీ పంచేందుకు జూనాగఢ్ లోని అన్ని బస్తీలకు ఆయన వెళ్తారు. 

 

Leave a Comment