ఎనిమిదేళ్లకే కుటుంబ బాధ్యతలు.. చదువుకుంటూ.. ఆటో తోలుతూ కుటుంబ పోషణ..!

ఏళ్ల తరబడి పెంచి పద్ద చేసి మంచి చదువులు చదివిస్తే చాలా మంది వారు మంచి స్థితికి వచ్చాక తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోతున్నారు. కానీ ఆటలాడుకునే వయస్సులో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు ఆ బాలుడు.. తల్లిదండ్రులు ఇద్దరూ ఇద్దరికీ చూపు లేదు. అతనికంటే చిన్న వాళ్లయిన మరో ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. దీంతో ఎనిమిదేళ్లకే  కుటుంబ పోషణ భారం అతనిపై పడింది. తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు ఎనిమిదేళ్ల వయస్సులో ఆటో తోలుతున్నాడు.. ఆటో నడుపుతూనే మరోవైపు చదువుకుంటున్నాడు.. ఎనిమిదేళ్ల వయస్సులోనే కుటుంబ బరువు బాధ్యతల్ని మోస్తోన్న బుడతడి కష్టాలు అందరినీ కదిలిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని గంగుడుపల్లి గ్రామానికి చెందిన బండి పాపిరెడ్డి, రేవతి దంపతులు. వీరికి గోపాలకృష్ణారెడ్డి, హిమవంతురెడ్డి, గణపతిరెడ్డి అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. పాపిరెడ్డి చిన్నతనంలో చూపు కోల్పోగా.. రేవతి పుట్టుకతోనే అంధురాలు.. పింఛన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పెద్ద కొడుకు గోపాలకృష్ణారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.. 

తల్లిదండ్రులకు చూపు లేకపోవడంతో కుటుంబ పోషణ భారం ఎనిమిదేళ్ల గోపాలకృష్ణారెడ్డిపై పడింది. తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు ఆటోలో గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసరాలు విక్రయిస్తున్నాడు. ఇంటి వద్ద పండించిన కూరగాయలు, ఆకుకూరలు సైతం తిరుపతికి తీసుకెళ్లి విక్రయించి వస్తాడని గోపాలకృష్ణారెడ్డి తల్లిదండ్రులు తెలిపారు. ఆడుకోవాల్సిన వయస్సులో మమ్మల్ని పోషిస్తున్నాడని రోధిస్తున్నారు. ఎనిమిదేళ్ల వయస్సులోనే వయసుకు మించిన పనిచేస్తున్న గోపాలకృష్ణారెడ్డికి హ్యాట్సాఫ్… 

Leave a Comment