వినూత్న బోధన.. ఇళ్లపై బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేసి పాఠాలు..!

కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే జార్ఖండ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలు చెబుతున్నారు. విద్యార్థుల ఇంటి గోడలపై బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేసి బోధిస్తున్నారు. 

కరోనా కారణంగా భౌతిక దూరం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈనేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ 200 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం డుమ్కాలోని డుమార్తర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇళ్ల గోడలపై నల్లబోర్డులను చిత్రించారు. స్మార్ట్ ఫోన్ లేని విద్యార్థులు తరగతులకు హాజరుకావచ్చని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు పాఠాలను బ్లాక్ బోర్డుపై రాసేందుకు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు లౌడ్ స్పీకర్ సాయంతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. ఈ బహిరంగ పాఠశాలకు సంబంధించిన ఫొటోను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంకా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మన భారతదేశంలో అద్బుతమైన చొరవ అంటూ ప్రశంసించారు.

Leave a Comment