రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఉద్యమం 

అఖిలపక్ష సమావేశంలో తీర్మానం

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస అఖిలపక్ష సమావేశం తీర్మానించింది.  రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా దిల్లీలో పర్యటించాలని విజయవాడలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్ణయించారు.

సమావేశంలో చేసిన తీర్మానాలివే..

* రాజధాని ప్రకటనతో మానసిక వేదనతో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలి.

* 13 జిల్లాల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేయాలి.

* రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా దిల్లీలో పర్యటించాలి.

* మహిళలను డ్రోన్‌తో చిత్రీకరించడంపై విచారణ చేపట్టాలి.

* ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసేలా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలి.

* మహిళలపై పెట్టిన కేసులతోపాటు పలువురిపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.

అంతకుముందు సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి తెదేపా, భాజపా, జనసేన కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. అమరావతి పోరాటం పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండించారు. జగన్‌ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. అమరావతిని సాధించే వరకు అలుపెరుగని పోరాటం చేయాలని తీర్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. రాజధాని కోసం రాజకీయాలను పక్కనపెట్టి వివిధ పార్టీల నాయకులు ముందుకు వచ్చారని తెలిపారు. అమరావతిని రక్షించుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదని పేర్కొన్నారు. న్యాయస్థానాలు కూడా అండగా నిలుస్తున్నాయని, రాజధానిని కాపాడుకోవడమే మన అజెండా అని ఐకాస నేతలు స్పష్టం చేశారు.

 

Leave a Comment