ఈటల మా భూములు లాక్కున్నారు.. సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రైతులు..!

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూవివాదంలో చిక్కుకున్నారు. మెదక్ జిల్లా మాసాయి పేట మండలం అచ్చంపేట, హకీం పేటలో జమున హ్చాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని బాధిత రైతులు నేరుగా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. తమ అసైన్డ్ భూములను మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుయాయులు సుదర్శన్, యంజాల సుధాకర్ రెడ్డి ఆక్రమించుకుంటున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. 

అచ్చంపేట, హకీం పేట్ గ్రామాల్లో 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని మంత్రి కబ్జా చేశారని, రెండు గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని కేసీఆర్ కు రాసిన లేఖలో రైతులు ఆరోపించారు. ఆ భూముల్లో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వారికి అడ్డుపడుతున్న రైతులను బెదిరిస్తున్నారని, తమ పొలాలకు వెళ్లే దారి మూసేసి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. భూములు తమకు అమ్మేయాలని, లేకుంటే శాశ్వతంగా దారిలేకుండా చూస్తామని బెదిరిస్తున్నారని లేఖలో రైతులు పేర్కొన్నారు. 

 శుక్రవారం మంత్రిపై వచ్చిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపగా, తనకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో తక్షణమే జిల్లా కలెక్టర్ ద్వారా విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం సీఎస్ ను ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచంద్రరావును ఆదేశించారు. సత్వరమే నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

Leave a Comment