Tirupathi: అనాథ అని నమ్మించి పెళ్లి చేసుకుంది.. రూ.6 లక్షలతో పరారైంది..

అనాథ అని నమ్మించి ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత యువకుడి వద్ద లక్షలు దోచుకుని పరారైంది. పెళ్లి పేరుతో యువతి మోసం చేసి తనను దోచేసిందని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయపురం మండలం నారపురాజు కండ్రికగకు చెందిన సునీల్ కుమార్(29) మార్కెట్ జాబ్ చేసుకుంటూ ఐదేళ్లుగా సత్యనారాయణపురంలో ఉంటున్నాడు. ఏడీబీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఎం సుహాసినితో సునీల్ కుమార్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుహాసిని మాత్రం తాను అనాథ అని, తనకు ఎవరూ లేరని సునీల్ ను నమ్మించింది. దీంతో గత ఏడాది డిసెంబర్ లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 

సునీల్ కుమార్ పెద్దలు సుహాసినికి 20 గ్రాముల బంగారు నగలు ఇచ్చారు. పెళ్లి తర్వాత ఈ మాయలేడ తన పథకం అమలు చేసింది. చిన్నప్పటి నుంచి తనను పెంచి పెద్ద చేసిన వారి ఆరోగ్యం బాగాలేదని, తాను పెళ్లికి ముందు కొన్ని అప్పులు చేశానని చెప్పి యువకుడి వద్ద రూ.4 లక్షలు, అతడి తండ్రి వద్ద రూ.2 లక్షలు ఇప్పించుకుంది. 

ఈ విషయం తెలుసుకుని ఈనెల 7న ఇంట్లో వారు ఆమెను నిలదీశారు. ఆ మరుసటి రోజు నుంచే ఆమె కనిపించకుండా పోయింది. ఆమె ఆధార్ కార్డు ఆధారంగా ఆరతీయగా నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమై కుమార్తె ఉన్నట్లు సునీల్ గుర్తించాడు. 

సుహాసిని ఫోన్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నానని, త్వరలోనే డబ్బులు ఇస్తానని చెప్పింది. కాదని పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని బెదిరించింది. ఏడాదిన్నర క్రితం మరో పెళ్లి కూడా చేసుకున్నట్లు సునీల్ ఫోన్ కు ఫొటోలను వాట్సాప్ చేసింది. దీంతో షాక్ అయిన సునీల్ అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం గాలిస్తున్నారు.  

Leave a Comment