కోరోనా సోకిన భర్తను కాపాడుకునేందుకు నోటి ద్వారా శ్వాస అందించిన భార్య.. అయినా నిలవని ప్రాణం..!

దేశంలో ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసలు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రాణాలుకోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రల్లో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన సంఘటన కన్నీరు పెట్టిస్తోంది. కరోనా సోకి శ్వాస ఆడక, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం భార్య తన నోటితో శ్వాస అందిస్తూ బతికించుకునే ప్రయత్నం చేసింది. అయినా భర్తను కాపాడుకోలేకపోయింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆగ్రాలోని హౌసింగ్ డెవలప్ మెంట్ సెక్టార్-7 నివాసి రవి సింఘాల్(47) కు కరోనా వచ్చింది. దీంతో అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అతని భార్య రేణు సింఘాల్ తన బంధువులతో కలిసి ఆటోలో ముందు రామా హాస్పిటల్ కు, తర్వాత సాకేత్ హాస్పిటల్, కేజీ నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లింది. 

ఆస్పత్రుల్లో బెడ్స్ లేకపోవడంతో సింఘాల్ ను ఎవరూ చేర్చుకోలేదు. చివరకు రేణు తన భర్తను తీసుకొని ఆటో ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. అప్పటికే భర్త కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో భర్తను కాపాడుకునేందుకు తన నోటితో శ్వాస అందించింది. ఎలాగైనా తన భర్త ప్రాణాలు దక్కించుకోవాలని పదే పదే నోటితో శ్వాస అందించింది. అయితే రవిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు తెలిపారు. దీంతో రేణు కన్నీరుమున్నీరైంది. భర్తను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయంటూ రోదించింది.  

Leave a Comment