ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు పిల్లలతో పంట కాల్వలో దూకిన తల్లి..!

ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి పంటకాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా కాటూరు పంచాయతీ పరిధి రాజుపేట సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడింది. 

ఉయ్యూరు రూరల్ పోలీసుల వివరా ప్రకారం వీరపల్లి గ్రామానికి చెందిన డొక్కు శ్రీనివాసరావుకు ఏలూరుకు చెందిన శ్రీలక్ష్మీతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాసరావు తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి రెండున్నరేళ్ల బాబు విష్ణువర్ధన్, ఎనిమిది నెలల పాప లహరి ఉన్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాసరావుకు పక్షపాతం వచ్చింది. 

దీంతో మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ బాధ్యత శ్రీలక్ష్మిపై పడింది. కూలీ పనిచేసి తెచ్చిన డబ్బు భర్త మందులకు, పిల్లలకు చాలక కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో చనిపోవాలని నిర్ణయించుకుంది.  పుట్టింటికి వెళ్లొస్తానని భర్తకు చెప్పి ద్వారకా తిరుమల వెళ్లే బస్సు ఎక్కింది. మార్గంమధ్యలో నందమూరు అడ్డరోడ్డు వద్ద దిగి పక్కనే ఉన్న దోసపాడు పంట కాల్వలోకి ఇద్దరు పిల్లలతో కలిసి దూకేసింది. 

కాల్వలో కొట్టుకుపోతున్న వారిని చూసిన స్థానికులు ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు. కానీ, ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా మారగా, ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది. కంకిపాడు సీఐ డి.కాశీవిశ్వనాథ్, ఉయ్యూరు ఎస్సై దుర్గా మహేశ్వరరావు సంఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. 

 

Leave a Comment