నాటి వరల్డ్ ఛాంపియన్.. నేడు ఛాయ్ వాలా..!

కరాటేలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన క్రీడాకారుడు.. ప్రస్తుతం రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. దేశ విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో 60కి పైగా పతకాలు సాధించాడు.. కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదు. కుటుంబం గడవడం కష్టమైంది. దీంతో  కుటుంబ పోషణ కోసం నేడు రోడ్డుకెక్కాడు.. అతడే ఉత్తరప్రదేశ్ కి చెందిన హరిఓమ్ శుక్తా..

శుక్లా తన ఆరేళ్ల ప్రాయంలోనే కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. 2013లో థాయ్ లాండ్ లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్ షిప్  పోటీల్లో భారత్ తరఫున స్వర్ణ పతకం సాధించాడు. ఇన్ని పతకాలు సాధించిన శుక్లాకు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సాయం అందలేదు. 

ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. ఇక అతనికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీలలో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అయిపోయింది. కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో చేసేది లేక ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఓ టీస్టాల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. 

దీనికి ముందు స్కూల్ పిల్లలకు కరాటే పాఠాలు నేర్పే వాడినని, కరోనా కారణంగా పిల్లలు ఎవరూ క్లాసులకు హాజరు కావడం లేదని శుక్లా తెలిపాడు. తప్పనిసరి పరిస్థితుల్లో టీస్టాల్ నడుపుతున్నానని పేర్కొన్నాడు. తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని వాపోయాడు. ప్రభుత్వం స్పందించిన తనకు క్రీడాకారుల కోటాలో ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. 

Leave a Comment